బొబ్బిలి: రాష్ట్రంలో తపాలా బీమా లక్ష్యం ఈ ఏడాది రూ.1550కోట్లుగా నిర్ణయించినట్లు ఆ శాఖ ఎ.డి జి.శివనాగరాజు తెలిపారు. ఈ మేరకు బొబ్బిలిలో డివిజన్ స్థాయిలో మూడు రోజుల జరగనున్న సేవింగ్స్ పోస్టల్ మేళాను ర్యాలీతో బుధవారం ప్రారంభించారు. పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అధ్యక్షతన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది లక్ష్యాన్ని 95 శాతం చేరుకున్నామన్నారు. దీనికి 30 శాతం అదనంగా ఈ ఏడాది లక్షాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల మేళాలో రూ.30 కోట్ల బీమా సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నా రు. ఇందులో భాగంగా మొదటిరోజునే రూ.10కోట్ల వ్యాపార లక్ష్యం పూర్తయిందని తెలిపా రు. లక్ష రూపాయల ప్రీమియం సాధించిన ఉద్యోగులకు సీజీఎం చేతుల మీదుగా ఘన సత్కారం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల మందికి బీమా చేశామని, పార్వతీపురం డివిజన్‌లో రూ.కోటి 25లక్షల బీమా ప్రీమియం లక్ష్యం కాగా దానిని మించి వ్యాపారం చేయడం సంతోషమన్నారు. జీఎస్‌టీ లేకుండా బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఏఎస్పీలు ఎం.సత్యనారాయణ, ఐ.మురళి మాట్లాడుతూ రూ.550తో రూ.10లక్షల బీమా, రూ.2,199 ప్రీమియంతో కుటుంబ సభ్యులందరికీ రూ.15లక్షల ఆరోగ్య బీమాను అందజేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీమా ప్రీమియం సేకరణ లక్ష్యాలను సాధించిన వారిని మెమెంటోలతో సత్కరించి అభినందించా రు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, జీడీఎస్‌లు, బీపీఎంలు, ఏబీపీఎంలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోస్టల్ ఎ.డి శివనాగరాజు