
బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం
పార్వతీపురం రూరల్: మండలంలోని కృష్ణపల్లి పంచాయతీలో అధికార టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పంచాయతీ ఉపసర్పంచ్ లంక శ్రీదేవిపై వారు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం, అవసరమైన సభ్యుల కోరం లేకపోవడంతో వీగిపోయింది. కనీస సభ్యుల హాజరును కూడా నిర్ధారించుకోకుండా అవిశ్వాసానికి సిద్ధమవడం, స్థానిక టీడీపీ నాయకత్వ అవగాహనలేమిని, ప్రణాళికా రాహిత్యాన్ని బయటపెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఏం జరిగిందంటే..?
కృష్ణపల్లి పంచాయతీ దివంగత సర్పంచ్ బోను రామునాయుడు కొద్ది కాలం క్రితం మరణించడంతో, ఉపసర్పంచ్ లంక శ్రీదేవి ఇన్‌చార్జ్ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పదవి నుంచి తొలగించేందుకు అధికార టీడీపీకి చెందిన వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీనిపై బుధవారం పంచాయతీ కార్యాలయంలో సబ్ కలెక్టర్ డా.ఆర్.వైశాలి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీలో సర్పంచ్‌తో పాటు 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2/3వ వంతు కనీసం ఏడుగురు సభ్యులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే, తీర్మానానికి మద్దతిస్తారని భావించిన సభ్యులతో సహా, సమావేశానికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశానికి కోరం కొరవడిందని, అందువల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. సొంతంగా ప్రతిపాదించిన తీర్మానానికే తగినంత మంది సభ్యులను సమీకరించుకోలేకపోవడంతో టీడీపీ నాయకులు అభాసుపాలయ్యారు.
కోరం లేక వీగిపోయిన అవిశ్వాస తీర్మానం