
కోర్టు చొరవతో బహిరంగ నిరసన
శృంగవరపుకోట: ఎట్టకేలకు కోర్టు జోక్యంతో జిందాల్ నిర్వాసితులు బుధవారం బహిరంగంగా నిరసన తెలియజేశారు. గడిచిన మూడు నెలలుగా జిందాల్ నిర్వాసితుల నిరసనలకు పోలీసులు అనుమతు లు నిరాకరించారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు నిర్వాసితులు నిరసన తెలిపేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు మూలబొడ్డవర రైతు సేవా కేంద్రం వద్ద నిరసన శిబిరం ఏర్పాటుకు నిర్వాసితులను అనుమతించారు. దీంతో బుధవారం నిర్వాసితులు తమ నిరసన శిబిరాన్ని బొడ్డవర నుంచి మూలబొడ్డవరకు మార్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ నియంతల్లా వ్యవహరించిన పోలీసులు ఎట్టకేలకు కోర్టు అదేశాలతో వెనక్కు తగ్గారన్నారు. రైతుసంఘం నేత చల్లా జగన్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం అటు కోర్టులో, ఇటు బయట తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. శాసనమండలిలో జిందాల్ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ రఘురాజుకు ధన్యవాదాలు తెలిపారు.