
కొత్త అధికారులకు సవాల్‌గాపైడితల్లి జాతర!
● 2వేల మంది సిబ్బందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్, ఎస్పీలు అనుభవం ఉన్న అధికారులే. ఇద్దరూ వారి వారి రంగాల్లో సిబ్బంది, అధికారుల చేత పని చేయించిన వారే. ఇద్దరి పరిపాలనా కాలంలో వచ్చే నెలలో జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికే వన్నె తెచ్చి పెట్టే నిర్వహించనున్న పండగ రానుంది. కానీ ఆ పండగ నిర్వహణను సమర్థవంతంగా భక్తులకు ఇబ్బంందులు కలగకుండా గత ఏడాది లాగానే ఈ ఏడాది పండగ ప్రశాంతంగా జరిగిందని సామాన్యులు భావించేలా చేయగలరా అన్నదే ఇద్దరు అధికారుల ముందున్న సవాల్. వాస్తవానికి విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతర మహోత్సవం నిర్వహణ జిల్లా అధికార యంత్రాంగానికి అందె వేసిన చెయ్యి. అందునా దేవాదాయ శాఖ జాతరను ఇట్టే నిర్వహించగలదు. ఎటొచ్చీ జాతర నిర్వహణ ప్రశాంతంగా, సురక్షితంగా ఈ ఏడాది పూర్తి చేయడం అటు దేవాదాయ, ఇటు పోలీస్ శాఖ పైనే ఆధారపడి ఉంది. ఇంతవరకు, ఇన్నాళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయనగరంలో ఉగ్రమూలాలున్న సిరాజ్ వ్యవహారాన్ని ప్రజలు చవిచూశారు. సాంస్కృతిక వారసత్వసంపద కలిగిన విజయనగరంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్‌ను ఎన్‌ఐఏ పట్టుకోవడం వారం రోజుల పాటు టూటౌన్ పోలీసుల సమక్షంలో విచారణ సాగించడం, ఆపై విశాఖ సెంట్రల్ జైల్లో ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో ఉన్న సిరాజ్‌ను ఇక్కడి కోర్టు జడ్జి వెబ్‌కామ్ ద్వారా విచారణ చేయడంతో సిరాజ్ ఎంతటి ఉగ్రవాదో..అలాగే విజయనగరంలో ఎన్నిచోట్ల బాంబు పేలుళ్లకు పథక రచన చేశాడో ఇప్పటికే పోలీసులు ఓ అంచనాకు వచ్చి ఉంటారు. ఇటువంటి సమయంలోనే కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్‌ల ఆధ్వర్యంలో పైడితల్లి జాతర జరగనుంది. ఇద్దరూ పండగ నిర్వహణకు కొత్తే. మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీషకు కూడా పండగ నిర్వహణ కొత్తే. ఇక జాతర నిర్వహణకు దాదాపు 2 వేల మంది సిబ్బంది అవసరమని పోలీస్ శాఖ గుర్తించింది. పొరుగు జిల్లాల నుంచి కూడా సిబ్బందిని తీసుకువచ్చే పనిలో పడింది. ఈ బందోబస్తు నిర్వహణలో విజయనగరం పరిధిలోని మూడు స్టేషన్ లలో ఒక్క టూటౌన్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ మినహా మిగిలిన వన్ టౌన్, రూరల్ స్టేషన్‌ల సీఐలకు కొత్తే. ఇక విజయనగరం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆర్.గోవిందరావు అటు లా అండ్ ఆర్డర్, మహిళ, ట్రాఫిక్ విభాగాలకు డీఎస్పీగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక దిగువ స్థాయిలో బందోబస్తు నిర్వహణ చూసే సిబ్బందికి మాత్రం జాతర నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లలో అనుభవం ఉంది. ప్రధానంగా ట్రాఫిక్ రెగ్యులరైజేషన్, వాహనాల పార్కింగ్‌ల గతేడాదిలాగానే ఎంటెక్ చదివిన పీసీ సింహాచలం వేసిన స్కెచ్‌ను ఈ ఏడాది కూడా అమలు చేస్తే వాహనదారులు సులభంంగా జాతర కు వచ్చి చూసి తరించి తిరిగి ఇళ్లకు చేరుకోగలుగుతారు.
జాతర సమర్థవంతంగా నిర్వహిస్తాం
శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతరను సమర్థవంతంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా, నిర్వహిస్తామని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. సిరిమాను ఉత్సవానికి బందోబస్తు నిర్వర్తించడంలో అనుభవం ఉందన్నారు.అమ్మ దయతో సిరిమాను ఉత్సవం గతేడాది లాగానే త్వరగా ముగించేలా చర్యలు చేపడతామని డీఎస్పీ గోవిందరావు తెలిపారు.