
బస్సులో ఆగిన గుండె
శృంగవరపుకోట: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి అదే బస్సులో తుదిశ్వాస విడిచాడు. స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ఈశ్వరరావు మంగళవారం ఉదయం విశాఖ –కించుమండ సర్వీస్‌కు కండక్టర్‌గా వెళ్లారు. విశాఖ నుంచి ఎస్.కోట వస్తుండగా మధ్యాహ్నం 12.30గంటల సమయంలో బస్సు పెందుర్తి– సరిపల్లి మధ్య ఉండగా కండక్టర్ ఈశ్వరరావు సీటులోనే గుండె పట్టుకుని కూలిపోయారు. ఆయనను గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పడంతో బస్సు ఆపిన డ్రైవర్ హుటాహుటిన పెందుర్తి పీహెచ్‌సీకి కండక్టర్‌ను తరలించారు. కండక్టర్ ఈశ్వరరావును పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్ మృతదేహాన్ని ఎస్.కోట తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈశ్వరరావు పార్థివ దేహాన్ని గంట్యాడ మండలంలో సొంత గ్రామమైన వసంతకు తరలించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
● విధినిర్వహణలో కండక్టర్ మృతి