
ఇటీవల ఇద్దరు యువకులు, ఇద్దరు చిన్నారుల మృతి
పార్వతీపురం రూరల్: ఇప్పటికే కాలానుగుణంగా వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగి నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. అయితే ఈత సరదాతో కొందరు చిన్నారులు పాఠశాలల సెలవు దినాల్లో స్నేహితులతో కలిసి నేలబావుల వద్ద, చెరువుల వద్ద, వాగులు, గెడ్డల వద్ద ప్రమాదకర స్థాయిలో ఈతకొట్టేందుకు వెళ్తున్నారు. లోతు పరిమాణం, ప్రవాహం అంచనా వేయలేని పరిస్థితుల్లో యువకులు, చిన్నారులు నీటి ప్రవాహంలో చిక్కుకుని మృతిచెంది తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగులుస్తున్నారు.
దసరా సెలవులకు ఇంటికి వచ్చి
మృత్యుఒడిలోకి..
దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సీతంపేట మండలం అచ్చబ గ్రామానికి చెందిన కొండగొర్రి మౌనిక(12), పాలక అంజలి(11) తమ గ్రామంలో ఉన్న చినబంద చెరువు దగ్గరకు ఈత సరదాతో వెళ్లి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు విడిచారు. ఇంట్లో తల్లిదండ్రులు బయట ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో చిన్నారులు కాస్త ఈత సరదాతో ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. స్థానికంగా ఉన్న ముత్యాలు బాలికల ఆశ్రమ పాఠశాలలో 6,7 తరగతులు చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థులు ఇటీవల దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి సోమవారం దుర్మరణం చెందారు.
వివాహ వేడుకకు వచ్చి మృతి..
గడిచిన మే నెల 20న పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న సాకిగెడ్డలో నూజివీడు ప్రాంతం నుంచి వచ్చిన ఐదుగురు స్నేహితులు ఈత సరదాతో గెడ్డలో దిగడంతో వారిలో ఈత రాని ఈశ్వర్‌కుమార్(16), నగిరెడ్డి రాము(16) ప్రవాహంలో ముగిని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
తల్లిదండ్రులు గమనించాలి
ఆటలు, ఈత సరదాపై తల్లిదండ్రులకు చెబితే వద్దంటారని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అవగాహన రాహిత్యంతో పిల్లలు స్నేహితులతో కలిసి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అయితే తల్లిదండ్రులు వారికి అర్థమయ్యే విధంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఘటనలను నెమ్మదిగా వివరిస్తూ అవగాహన కల్పించాలి. అలాగే ఎప్పటికప్పుడు సెలవు దినాల్లో పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. – కె. మురళీధర్, సీఐ, పార్వతీపురం పట్టణం

ఇటీవల ఇద్దరు యువకులు, ఇద్దరు చిన్నారుల మృతి