
ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నంపైడితల్లి పండగ
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఉత్తరాంధ్ర సాంస్కృతిక చిహ్నమని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను విజయవంతం చేసే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎఆర్.దామోదర్ సూచించారు. అమ్మవారి చదురుగుడి పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు, సిరిమాను తిరిగే ప్రాంతాలను మంగళవారం వేకువజామున అధికారులతో కలిసి వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం మనందరి బాధ్యతని గుర్తు చేశారు. పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య శిబిరాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలన్నారు. జాతర ప్రాంగణంలో శిథిలావస్ధలో ఉన్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిరిమాను జాతరలో భక్తుల రక్షణ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ వ్యవస్థ, మహిళల భద్రత, రాత్రి పహారా వంటి చర్యలను కఠినంగా అమలు చేస్తామన్నారు. భక్తులు శాంతిభద్రతల నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిరిమాను జాతర ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ అధికారులు ఈ ఉత్సవం ఉత్తరాంధ్రలో ఏకత్వానికి ప్రతీకగా, భక్తుల విశ్వాసం నిలబెట్టే విధంగా ప్రతి శాఖ ముందంజలో ఉంటూ పని చేయాలని సూచించారు. ముందుగా అమ్మవారి క్యూలైన్లు, సిరిమాను తిరిగే అమ్మవారి ఆలయం నుంచి కోట వరకూ పరిశీలన చేశారు. ప్రసాదాల పంపిణీ, మీడియా పాయింట్ ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పూజారి ఇంటి వద్ద చేపట్టనున్న సిరిమాను తయారీ, అక్కడ నుంచి గుడి వరకూ సిరిమాను తరలించే విధానం తెలుసుకుని ఆ మార్గమంతా పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో కీర్తి, ఏసీపీ సౌమ్యలత, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీషా, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, తహసీల్దార్ కూర్మనాఽథ్, సిరిమాను అధిరోహకులు బంటుపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
● అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సిరిమాను జాతర
● సిరిమాను తిరిగే ప్రదేశాలను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ