
కొత్తవలసలో భారీ వర్షం
● ముంచెత్తిన వరద నీరు
కొత్తవలస: కొత్తవలసను మంగళవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. గృహాలు, షాపుల్లోకి వరదనీరు పొంగి పారడంతో పట్టణవాసులు నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఆర్‌టీసీ కాంప్లెక్స్, మేజర్ పంచాయతీ కార్యాలయం, అరకు–విశాఖ జాతీయ రహదారి, కొత్తవలస–విజయగనరం రోడ్డు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధిక వరద కారణంగా కొత్తవలస రైల్వే అండర్ బ్రిడ్జిని రైల్వే అదికారులు తాత్కాలికంగా మూసేశారు. రైల్వే పోలీసులు బ్రిడ్జి వద్ద బందోబస్తును నిర్వహించారు. కాగా కొత్తవలసను కొద్ది నెలలుగా వర్షం నీరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మండల కేంద్రంలో గల వీరసాగరం చెరువు నుంచి వచ్చే మిగులు నీరు గతంలో కాలువల వెంబడి పారేది. ప్రస్తుతం కాలువలను పలువరు ఆక్రమించి పూర్తిగా కప్పేశారు. దీంతో వరద నీరు రోడ్లుపై పొంగి పారుతోంది. అధికారులు దృష్టి సారించి ఆక్రమణలను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పొంగిపొర్లుతున్న గవరపాలెం గెడ్డ
కొత్తవలస: మండల కేంద్రం నుంచి సబ్బవరం రోడ్డులో గవరపాలెం గెడ్డ మంగళవారం కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతోంది. గెడ్డ అత్యంత ఉద్రిక్తంగా పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస నుంచి నిత్యం ఈ రోడ్డులో అనకాపల్లి జిల్లా సబ్బవరం,కొత్తవలస మండలం దెందేరు.సంతపాలెం, గులివిందాడ, గనిశెట్టిపాలెం తదితర గ్రామాలకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. గెడ్డ పొంగి పారడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. రాత్రి వరకు వరదనీరు తగ్గకపోవడంతో వాహనదారులు నిరీక్షించారు.

కొత్తవలసలో భారీ వర్షం