
వెబ్‌ల్యాండ్ సమస్య
ఈ క్రాప్‌కు
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు చేస్తున్న రైతులను ఆది నుంచి కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఆలస్యంగా ఖరీఫ్ పనులు ప్రారంభించారు.విత్తనాలు మొదలుకుని ఎరువులు సేకరించడానికి నానా యాతన పడుతున్న విషయం తెలిసిందే. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఆ పంటను అమ్ముకోవాలంటే పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే కొందరి భూముల వివరాలు పక్కాగా ఉండడంతో అటువంటి వారి పంటల వివరాలు సక్రమంగా ఈ–క్రాప్‌లో నమోదవుతున్నాయి. ఇంకొందరు రైతులకు ఉమ్మ డి ఖాతాలు ఉండడంతో వారి పేర్లు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ఈ సమస్యను సంయుక్తంగా పరిష్కరించాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో రైతులు చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేస్తున్నారు. ఇందులో వరి 1.65 లక్షల ఎకరాలు కాగా చెరకు, అరటి, ఇతర కాయగూరల పంటలు 1.55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంటల దిగుబడి వచ్చేటప్పుడు ఆ పంటలను అమ్ముకోవడానికి ఈ–క్రాప్ నమోదు చేయాలి. వ్యవసాయ సహాయకులు తమ సచివాలయాల పరిధిలోని రెవెన్యూ గ్రామాలకు వెళ్లి పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేయాలి.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి 1.35 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేశారు. ఇంకా 1.85 లక్షల ఎకరాల్లో నమోదు చేయాల్సి ఉంది. మిగిలిన పంటల వివరాలను నమోదు చేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించలేకపోవడంతో రైతులు ఈ–క్రాప్ నమోదుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సుమారు 50 గ్రామాల్లో కష్టాలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 50 గ్రామాల్లో ఈ–క్రాప్ సమస్య రైతులను వెంటాడుతోంది. ఈ–క్రాప్‌లో నమోదు చేయాలంటే కచ్చితంగా భూమల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించాలి. అయితే ఈ గ్రామాలకు సంబంధించిన వివరాలు కనిపించక ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగుతోందని రైతులు అంటున్నారు. ముఖ్యంగా జాయింట్ అకౌంట్ ఉన్న రైతుల ఖాతాలను వేరు చేసి వారి పేర్లు వ్యవసాయశాఖ సైట్‌లో కనిపించేటట్లు చేస్తే ఈ–క్రాప్ నమోదు వేగవంతంగా పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆందోళన వద్దు
ఈ ఏడాది జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.35 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు పూర్తి చేశాం.మరో 1.85 లక్షల ఎకరాల్లో నమోదు చేయాల్సి ఉంది. జాయింట్ అకౌంట్ ఉన్న రైతులు తమ పరిధిలో ఉన్న వీఆర్‌ఓను సంప్రందిస్తే ఆయన లాగిన్‌లో జాయింట్ అకౌంట్‌లో ఉన్న రైతుల భూమిని వేరు చేస్తారు. తర్వాత ఆ వివరాలు మండల వ్యవసాయశాఖ అధికారి లాగిన్‌కు వస్తాయి, ఏఓ లాగిన్‌లో జాయింట్ అకౌంట్ వివరాలను నిర్ధారిస్తారు. తర్వాత ఆ వివరాలు సచివాలయంలో ఉన్న వ్యవసాయ సహాయకుల లాగిన్‌కు వెళ్తాయి. రైతులు వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే ఈ–క్రాప్‌లో పంటల వివరాలను నమోదు చేస్తారు. దీని కోసం రైతులు ఆందోళన చెందవద్దు.
:కె.రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం

వెబ్‌ల్యాండ్ సమస్య