
ప్రతీ సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారం కావాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌వో కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి భాగస్వామ్యంతో 280 వినతులను స్వీకరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం జరుగుతుందన్న ప్రజల నమ్మకం మేరకు అధికారులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతీ అర్జీని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలి : ఎస్పీ
నిర్దేశించిన సమయంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి సంబంధిత పోలీసు శాఖాధికారులకు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు అంశాలు వాస్తవాలైతే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 60 వినతులు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాలకొండ సబ్ కలెక్టర్, ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం నిర్వహించారు. 60 వినతులు వచ్చాయి. అటవీ భూమికి సర్వే చేసి పట్టా ఇప్పించాలని భామిని మండలం బొమ్మికకు చెందిన గణపతి కోరారు. పాఠశాల భవనం మంజూరు చేయాలని లోకొండ గ్రామ గిరిజనులు అర్జీ ఇచ్చారు. వరదగోడ మంజూరు చేయాలని కాంగూడ గ్రామస్తులు విన్నవించారు. కమ్యూనిటీ భవనం నిర్మించాలని కేరాసింగి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని పాలకొండకు చెందిన చల్లా సుధాకర్ కోరారు. కుట్టు మిషన్ ఇప్పించాలని తాటిమానుగూడ గ్రామస్తురాలు సావిత్రి వినతి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీ ఈవో రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్

ప్రతీ సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్