
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘సరస్’
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి
విజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాలను పురస్కరించుకుని సెర్ప్, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సరస్ – 2025 పేరుతో అఖిల భారత డ్వాక్రా బజార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ పథక సంచాలకులు శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. సోమవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో డీపీఎం, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జంక్షన్ వద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డు పక్కన సరస్ నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 250 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 28 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటూ వివిధ రాష్ట్రాల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాలు, ప్రదర్శన చేస్తారన్నారు. మున్సిపల్, పోలీస్, హార్టికల్చర్, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, నాబార్డ్ ప్రభుత్వం శాఖలతో సమన్వయం, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, మంచినీరు, భోజన, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలపై సమీక్ష చేశారు. కార్యక్రమంలో అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి ప్రాజెక్ట్ మేనేజర్ డి.రత్నాకర్, అకౌంట్స్ ఆఫీసర్ బివివిఎస్.దొర తదితరులు పాల్గొన్నారు.