
వినతుల పరిష్కారంలో గార్డియన్‌లుగా వ్యవహరించాలి : కలెక్ట
విజయనగరం అర్బన్: ప్రజల నుంచి వస్తున్న అర్జీలలో అధికంగా రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయని వాటిని అధిగమించడానికి సంబంధిత అధికారులు చట్టాలపై పూర్తి అవగాహనతో ఉంటూ వారికి గార్డియన్‌గా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ ప్రగతిపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయికి రావాలసిన దరఖాస్తుదారులు మాత్రమే ఇక్కడికి వచ్చే విధంగా మండల స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. మ్యుటేషన్, 1 బీ నమోదు, భూముల కొనుగోలు, వారసత్వం, ప్రభుత్వ భూమి తదితర స్వరూపాలపై తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మాజీ సైనికులకు కేటాయించిన భూమలపై నిబంధనలు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సేవల విషయంలో ప్రజల సంతృప్తి స్థాయి వారానికి కనీసం 2.5 శాతం వృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ కొన్ని పిటీషన్లు 100 రోజుల ఎస్‌ఎల్‌ఏకి మించి సమయం ఉన్నప్పటికీ 15, 20 రోజుల్లోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమీక్షలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, పీజీఆర్‌ఎస్ నోడల్ మురళి, జిల్లా అధికారులు, వర్చువల్ విధానంలో ఆర్డీవోలు, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.