
మరో 1.10 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
● అక్షర వాచకం పుస్తక ఆవిష్కరణలో కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో మరో 1.10 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ అక్షరాంధ్ర లక్ష్యమని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అక్షర వాచకం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్‌డీఏ ద్వారా 60,715 మంది, మెప్మా ద్వారా 12 వేల మంది మహిళలను, డ్వామా ద్వారా 38,200 మంది పురుషులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. రానున్న మూడు నెలల్లో వంద గంటలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కోర్స్ పూర్తి చేసిన వారికి నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎఫ్‌ఎల్ అండ్ టీ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఆసక్తి గల నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్‌వో శ్రీనివాససమూర్తి, ఎస్డీసీలు వెంకటేశ్వరరావు, ఇ.మురళీ, నూకరాజు, ప్రమీలగాంధీ, వయోజన విద్య నోడల్ అఽధికారి ఎ.వేణుగోపాల్, డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు శ్రీనివాస్, శారదాదేవి, చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.