
25న యూటీఎఫ్ రణభేరి
పార్వతీపురం టౌన్: ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 25న గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న యూటీఎఫ్ రణభేరి సభకు ఉపాధ్యాయులంతా తరలి రావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు పిలుపునిచ్చారు. డీఈవో కార్యాలయం వద్ద రణభేరికి సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. రణభేరి జాతర సందర్భంగా యూటీఎఫ్ గుర్తించిన సమస్యలతో పాటు ఉపాధ్యాయులు కూడా వారి సమస్యలు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞాపనల రూపంలో అందజేశారని అన్నారు. వీటిని క్రోడీకరించి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లు ఉంచనున్నట్టు తెలిపారు. విద్యా రంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించడానికి నిరాకరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తోందన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణమే నియమించి మధ్యంత భృతిని ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, కె.భాస్కరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.