
మృత్యు ఒడిలోకి...
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఒకరిని కాపాడబోయి మరొకరు..
అచ్చెబ గ్రామంలో విషాదం
విలపిస్తున్న కుటుంబ సభ్యులు
సీతంపేట: పాఠశాలకు దసరా సెలవులిచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఆ శ్రమ పాఠశాల నుంచి గ్రామానికి చేరుకున్న చిన్నారులను... చెరువు రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరి ప్రాణాలను హరించింది. కన్నవారికి శోకాన్ని మిగిల్చింది. సీతంపేట ఏజెన్సీలోని అచ్చెబ గ్రామస్తులను విషాదంలో ముంచింది. వివరాల్లోకి వెళ్తే...
సీతంపేట మండలం ముత్యాలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పాలక అంజి లి (11) ఆరో తరగతి, కొండగొర్రె మౌనిక (12) ఏడో తరగతి చదువుతున్నారు. పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వడంతో శనివారం స్వగ్రామమైన పెద్ద గూడ పంచాయతీ పరిధిలోని అచ్చెబ గ్రామానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం గ్రామం శివారున ఉన్న చెరువులో స్నానం కోసం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లారు. ఉపాధిహామీ పనుల్లో భాగంగా చెరువును లోతు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిండా నీరు చేరింది. చెరువు లోతు తెలియని అంజిలి ముందుగా స్నానానికి దిగి మునిగిపోతుండగా కాపాడేందుకు మౌనిక ప్రయత్నించింది. ఇద్దరూ కళ్లముందే మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న మరో ఇద్దరు పిల్లలు కేకలు వేస్తూ గ్రామానికి వెళ్లి చెప్పారు. మౌనిక తల్లి సుశీల చెరువు వద్దకు చేరుకునేసరికి అంజిలి మృతదేహం తేలియాడుతోంది. బతికి ఉందనుకుని తన చీరను విసిరి అందుకోమని కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో గ్రామస్తులంతా చేరుకుని ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
కూలి కుటుంబాల్లో విషాదం
చిన్నారులిద్దరివీ నిరుపేద కుటుంబాలు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను సాకుతున్నారు. అంజి లి మృతితో తండ్రి రాజారావు, సుజాతతో పాటు చెల్లి పౌర్ణమి, తమ్ముడు అభి బోరున విలపించారు. మౌనిక మృతితో తండ్రి వల్లభరావు, తల్లి సుశీల, అన్నయ్య వంశీ, చెల్లి శ్రావ్య విషాదంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ముత్యాలు ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం హెచ్.శ్రావణి, సిబ్బంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు చొప్పున అందజేశారు.

మృత్యు ఒడిలోకి...