
అపురూపం...కోటదుర్గమ్మ నిజరూపం
● పోటెత్తిన భక్తజనం ● అమ్మవారి సేవలో తరించిన ప్రముఖులు ● భక్తసంద్రంగా మారిన పాలకొండ
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. ముగ్గు రమ్మల మూలపుటమ్మ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. రాజుల కోటలో వెలసిన కోటదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు కటకం వారసులు ముహూర్తపు రాట వేయగా, దేవదాయ శాఖ తరఫున ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తరలివచ్చిన భక్తజనం
ఏడాదిలో ఒక్కరోజు కనిపించే అమ్మవారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శన భాగ్యంతో పులకించిపోయారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
కోటదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
కోటదుర్గమ్మ నిజరూపం దర్శనం కోసం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి సేవ లో తరించారు. సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నా థ్, తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి అమ్మవారిని దర్శించుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. డీఎస్పీ ఎం రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. కోటదుర్గమ్మ ఆలయం ఆవరణలో భక్తుల విరాళాలతో సుమారు ఆరువేల మందికి అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించారు.