
● నిధులున్నా రోడ్డు నిర్మాణంలో జాప్యం ● గిరిజనులకు శాపం
నిండు గర్భిణిని.. డోలీలో 8 కిలోమీటర్లు...
కొమరాడ: గిరిజనులను డోలీ కష్టాలు వీడడం లేదు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంలో జాప్యం గిరిజనులకు శాపంగా మారింది. కొమరాడ మండలంలోని నయా గ్రామానికి చెందిన నిండుగర్భిణి కోలక భామిడమ్మకు సోమవారం ఉదయం పురిటినొప్పలు వచ్చాయి. గ్రామానికి వాహనం వెళ్లే దారిలేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో రాళ్ల దారిలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని సీసాడ వలస వరకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి 108లో వైద్యం కోసం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గ్రామానికి రహదారి ఏర్పాటుకు నిధులున్నా అటవీశాఖ అధికారుల అనుమతి లేక ఆగిపోయింది. అటవీశాఖ నుంచి అనుమతులు తేవడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు కష్టాలు తెచ్చిపెడుతోందని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జగదీశ్వరి స్పందించి నయా, సంకేస్, దేరుపాడు లొడ్డ, ఉల్లేంద్రి, ఉలిగేస్, తదితర గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూడేస్, కుంతేస్, మసిమండ, పెదశాఖ, గుణదతీలేస్, చోళ్లపదం తదితర పంచాయతీల ప్రజలకు కూడా అత్యవసర వేళ డోలీలే దిక్కవుతున్నాయని వాపోయారు.