
శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
● నేడు కోటదుర్గమ్మ నిజరూప దర్శనం ● వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం
పాలకొండ:
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధంచేశారు. సోమ వారం అమ్మవారి నిజరూప దర్శనం కోసం ప్రత్యే క ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం తమతమ శాఖల పరిధిలో పనులు పూర్తిచేసింది.
ఉదయం 8 గంటల నుంచి....
కోటదుర్గ అమ్మవారి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక రోజులో కొన్ని గంటలు మాత్రమే భక్తులకు కల్పించడం ఆనవాయితీ. ఈ మేరకు సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు ఈ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం మూహూర్తపు రాట అనంతరం స్థానిక ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత అమ్మవారి దర్శనం కోసం క్యూలలో భక్తులను పంపిస్తారు. ఉచిత, శ్రీఘ్ర, వీఐపీ, వీవీఐపీ దర్శనాల కోసం క్యూలు ఏర్పాటు చేశారు.
ఉచిత అన్న ప్రసాదం వితరణ
అమ్మవారి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం కొనసాగుతుంది. దీని కోసం దేవదాయ శాఖ ఎటువంటి నిధులు అందించక పోయినా పట్టణంలోని పలువురు భక్తులు అందించిన విరాళాలతో అన్నదానం చేపడుతున్నారు. దీనికోసం రోజుకు సగటున రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం