
వీర మహిళలను ఆపేదెవడ్రా..!
● జనసేన వీర మహిళల మధ్య కుల దూషణ కేసు
బొబ్బిలి: సమాజంలో కులదూషణ, అణచివేతను ప్రశ్నించేందుకు వచ్చిన జనసేన పార్టీలో వీర మహిళలే కుల దూషణ కేసుపై పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. జనసేన మహిళపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతోనే కాదని, వెంటనే ఆమెను అరెస్టు చేయాలని బాధితురాలు కోరుకుంటోంది. పోలీసు ఫిర్యాదును అనుసరించి జరిగిన విషయం ఏమిటంటే.. బొబ్బిలి జనసేన పార్టీలో వీర మహిళగా గత ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న బిగులు లక్ష్మి తనను స్థానిక ఫూల్‌బాగ్‌లో ఉంటున్న మరో వీరమహిళ ఎస్సీ కులం పేరుతో పలుమార్లు దూషిస్తోందని, తనకు పదవి ఇస్తే ఇటువంటి వారికి కూడా పదవులిస్తారా.. అని కులం పేరుతో దూషిస్తోందని సమాజంలో తనను అందరూ చిన్న చూపు చూస్తున్నారని ఈ నెల 13న స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే కాదు మండలంలోని పారాదిలో గతంలో దేవాలయ ప్రతిష్ఠ కోసం స్థానికులు తనను ఆహ్వానిస్తే ఇటువంటి వారిని ఎవరు ఆహ్వానించారు..?తక్కువ కులానికి చెందిన వారిని ఆహ్వానిస్తే మైల పడతాం అని అందని ఫిర్యాదులో లక్ష్మి పేర్కొంది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నాయకులు, కార్యకర్తలతో మాట్లాడితే అటువంటి వారితో మాట్లాడకండని అందరిలో అవహేళన చేస్తోందని బిగులు లక్ష్మి వాపోయింది. అంతేకాదు తన కులం గూర్చి దూషిస్తూ, అవమాన పరుస్తూ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టిందని చెప్పింది. ఇటీవల ఉచిత బస్సు ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యే బేబీ నాయనతో తీసుకున్న ఫొటోను తెలుగు మహిళ గ్రూపులో తాను పోస్టు చేయగా దానిపైనా విమర్శలు చేసి డిలీట్ చేసిందన్నారు. ఈ స్క్రీన్ షాట్లను కూడా సమర్పిస్తున్నట్టు పోలీసులకు తెలియజేసింది బాధితురాలు. ఆమైపె చర్య తీసుకోవాలని తనకు ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కొసమెరుపేంటంటే...బాధితురాలు ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి.
అరెస్టు చేయాలి..
కులం పేరుతో దూషించిన మహిళను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధితురాలితో కలసి సీపీఐ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కులం పేరుతో కొన్ని వర్గాలను అణచివేసే ధోరణి ఉండటం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఆమెను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. నాయకులు రాకోటి నాగమ్మ, వై.బాబ్జీలతో పాటు బాధితురాలు బిగులు లక్ష్మి ఉన్నారు.
దర్యాప్తులో ఉంది
జనసేన పార్టీలో మహిళ తనను కులం పేరుతో దూషించిన బంటుపల్లి దివ్యపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డీఎస్పీ జి.భవ్యారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
– సతీష్ కుమార్, సీఐ, బొబ్బిలి