
ప్రతి ఒక్కరూ చెట్లను దత్తత తీసుకోవాలి
● టెర్రస్ గార్డెన్‌ను ప్రోత్సహించండి
● కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి
విజయనగరం: ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలని, వీలు కాని పక్షంలో టెర్రస్ గార్డెన్‌ను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రింగ్ రోడ్డు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు, పాఠశాలలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెట్లు నరికివేయడం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, పచ్చదనం పెంపొందించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్ తెలిపారు. క్వాలిటీ లైఫ్ కోసం మొక్కలు అనివార్యం అని ఆయన వివరించారు. స్థలం లేని ప్రాంతాలలో టెర్రస్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. టెర్రస్ గార్డెన్ ద్వారా ఇంట్లోకి అవసరమైన కూరగాయలు పండించుకోవచ్చని, ప్రకృతికి అవసరమైన పచ్చదనం పెరుగుతుందని, మొక్కలకు సేవ చేయడం ద్వారా శారీరక శ్రమతో ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇంటి వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేయవచ్చని కలెక్టర్ వివరించారు. స్థానిక కార్పొరేటర్ లక్ష్మణరావు మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని కోరారు. ముందుగా అక్కడ ఉన్న పార్కులో కలెక్టర్ ఇతర అధికారులు మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞలో పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య, జిల్లా పరిషత్ సీఈవో డి.సత్యనారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.సాంబమూర్తి, ఈఈ పీఎస్‌వీవీ ప్రసాద్, డీఈఈ శ్రీనివాసరావు, ఏసీపీలు రమణమూర్తి, హరిబాబు, మెప్మా పీడీ చిట్టిబాబు, తహసీల్దార్ కూర్మనాధ్ తదితరులు పాల్గొన్నారు.