
28న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు
● హాజరు కానున్న 250 మంది క్రీడాకారులు
● ట్రోఫీలను ఆవిష్కరించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విజయనగరం: జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి మిస్టర్ ఆంఽధ్రా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించటం మంచి పరిణామమని, క్రీడలకు, క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఏపీ శాసనసభా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ నెల 28న నగరంలోని ఆనందగజపతి కళాక్షేత్రం వేదికగా నిర్వహించ తలపెట్టిన కనకల ఎర్రయ్య మెమోరియల్ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీల ట్రోఫీలను ఆయన తన నివాసంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడి రామమూర్తి స్ఫూర్తితో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న బాడీ బిల్డింగ్ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక, మానసిక ధృడత్వం కలుగుతుందని ప్రతి ఒక్కరు ఆ దిశగా తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరయ్యే వివిద జిల్లాల క్రీడాకారులకు మంచి ఏర్పాట్లు చేసి విజయనగరం ప్రతిష్టను చాటి చెప్పాలని ఆకాంక్షించారు. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ మాట్లాడుతూ కనకల ఎర్రయ్య మెమోరియల్ పేరిట ఈ ఏడాది 12వ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది నిర్వహించిన పోటీలకు 182 మంది క్రీడాకారులు హాజరు కాగా... ఈ ఏడాది సుమారు 250 మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దసరా, పైడితల్లమ్మ వారి ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ.1.30 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు వివరించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బైక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.