
వృద్ధ దంపతుల బలవన్మరణం
● అనారోగ్యంతో అష్టకష్టాలు
● పిల్లలకు భారం కాకూడదని ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: పిల్లలకు పెళ్లిళ్లు చేసిన ఆ వృద్ధ దంపతులు తమకొచ్చిన అనారోగ్యంతో వారికి భారం కాకూడదు అనుకున్నారు. దీంతో బలన్మరణానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ వెల్లడించారు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి వీటీ అగ్రహారానికి చెందిన కానూరి సత్యనారాయణ(60), భార్య కానూరి పార్వతి(54) వై జంక్షన్ వద్ద ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి ఉండగా ఇద్దరికీ పెళ్లి చేసేశారు. అబ్బాయి రమేష్‌తోనే కొన్నాళ్లుగా వై జంక్షన్‌లో టిఫిన్ దుకాణం నడుపుతున్నారు. ఇంతలోనే ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. సత్యనారాయణ మానసిక వ్యాధితో, పార్వతి ఫిట్స్‌తో బాధ పడుతుండేవారు. ఈ సమస్యలు కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఆసుపత్రి ఖర్చులు, మరో వైపు పిల్లలపై ఆధారపడ్డాం అన్న బాధ వారిని కృంగదీసింది. ఆ బాధలను నెగ్గలేక, పోరాటం చేయలేక ఇద్దరూ పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలను సర్వజన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.