
అందరి సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం మోపాం
విజయనగరం క్రైమ్ : ప్రతీ ఒక్కరి సహకారంతోనే గంజాయిపై ఉక్కు పాదం మోపామని గుంటూరు జిల్లాకు బదిలీ అయిన ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. విజయనగరం పోలీసు బ్యారెక్స్‌లో ఎస్పీ వకుల్ జిందల్ వీడ్కోలు కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. జిల్లా ప్రజలు, అధికారులు, సిబ్బందిని విడిచి వెళ్లడం బాధగా ఉందన్నారు. జిల్లాలో గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేశామని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను కూడా అటాచ్ చేశామన్నారు. బాలలపై జరిగే అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై నమోదైన కేసుల్లో నిందితులకు ఆరు మాసాల్లోనే శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాల కట్టడికి సమర్ధవంతంగా పని చేశామన్నారు. తన విధి నిర్వహణలో అందించిన సహకారం మరువలేనన్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్‌ను దుశ్శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. అనంతరం ఎస్పీ జిందల్‌ను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.సౌమ్యలత, జి.నాగేశ్వరరావు, డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, పలువురు రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వీడ్కోలు సభలో ఎస్పీ వకుల్ జిందల్