
మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!
సాక్షిప్రతినిధి విజయనగరం:
వాస్తవానికి మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే నినాదం జనసేనవాళ్లది.. కానీ అదేం ఖర్మనో వాళ్లను అందరూ.. అన్ని చోట్లా ఆపేవాళ్లే. ఆఖరుకు ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తామన్నా టీడీపీ వాళ్లు పైనుంచి కిందవరకూ ఓ సారి తేరిపార చూసి మీరు అవతలకు వెళ్లండమ్మా అనేస్తున్నారు. వాళ్లను కనీసం భాగస్వామ్య పక్షాలుగా కూడా రాజకీయపార్టీ కార్యకర్తలుగా పరిగణించడంలేదు. జస్ట్ డబ్బులిస్తే పనిచేసే కూలీలుగా మాత్రమే చూస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రతిసారీ తెలుగుదేశం విజయానికి దోహదపడే బీజేపీది కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉంది. విజయనగరం జిల్లాలో.. ముఖ్యంగా పట్టణంలో అయితే తెలుగుదేశం మినహా.. భాగస్వామ్య పార్టీలకు వీసమెత్తు విలువలేకుండా పోయింది. అదేదో సినిమాలో మంత్రి పాత్రధారి రావు రమేష్ ‘చెప్పులు మనలను మోస్తున్నాయి కదాని వాటిని బెడ్ రూములోకి తీసుకెళ్లలేం కదా.. వాటిని గుమ్మంలోనే వదిలేయాలి..’ అంటాడు.. పాపం ఇప్పుడు విజయనగరంలో జనసేన.. బీజేపీల పరిస్థితి చెప్పులకన్నా దారుణంగా తయారైంది.. ఆఖరుకు తమ నాయకుల పుట్టినరోజులు ఫ్లెక్సీలు కూడా పెట్టుకోలేని దైన్యం.
● పెట్టిన వెంటనే తొలగింపు...
ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పట్టణంలో జనసైనికులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే వాళ్లు ఇలా ఫ్లెక్సీలు పెట్టిన ఒక పూట కూడా గడవకముందే మున్సిపల్ అధికారులు తొలగించారు. నిన్న ప్రధాని మోదీ పుట్టినరోజునాడు బీజేపీ క్యాడర్ కూడా ఏదో బలప్రదర్శన చేద్దామని ఎక్కడా స్థలం లేనట్లు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పేరిట పెట్టిన ఫ్లెక్సీలు పైన బీజేపీ ఫ్లెక్సీలు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయారు. ఇలా ఫ్లెక్సీలు పెట్టిన కాసేపట్లోనే వాటిని కూడా తీసేశారు. దీనికోసం ఆఖరుకు బీజేపీ నాయకులు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేయాల్సిన దుస్థితి నెలకొంది. అదేం చిత్రమో కానీ.. టౌన్ మొత్తం తెలుగుదేశం ఫ్లెక్సీలు కనిపిస్తాయి. వాటిని మాత్రం మున్సిపాలిటీ వారు కనీసం టచ్ చేయలేరు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటి చుట్టూ.. రైతుబజార్ వద్ద.. ఆయన ఇంటికి వెళ్లే రోడ్డు మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయి కానీ అవేమీ మున్సిపాలిటీవారికి కనిపించవు. ఇక అశోక్ బంగ్లా గేటు ఎదురుగా భారీ ఫ్లెక్సీలు నిత్యం ఉంటాయి. వాటిని కూడా కార్పొరేషన్ సిబ్బంది ముట్టుకునే ధైర్యం చేయరు.
టీడీపీది కపటప్రేమ
కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలకు సమప్రాధాన్యం ఇవ్వాలి. కానీ కేవలం తెలుగుదేశం ఒక్కటే ప్రభుత్వం అన్నట్లు ఉంటే ఎలా..? పట్టణంలో జనసేన.. బీజేపీలకు బలం లేదని చెప్పి.. మున్సిపల్ ఎన్నికల్లో మాకు సీట్లు ఎగ్గొట్టడమో.. తక్కువ సీట్లు ఇవ్వడమో .. ఇలాంటి కుట్రలు పన్నడానికే ఈ ఫ్లెక్సీల తొలగింపు అనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచేవరకు అందరం ముఖ్యం అని కపట ప్రేమ చూపించిన టీడీపీ నాయకులు గెలిచాక మమ్మల్ని చిన్న చూపు చూడడం చాలా బాధాకరం. ఈ అంశాన్ని మేము మా పెద్దలవద్దకు తీసుకెళ్లి మా గౌరవాన్ని కాపాడుకుంటాం.
– గురాన అయ్యలు, జనసేన పార్టీనాయకులు
విజయనగరం సిటీలో టీడీపీ పెద్దరికం
బీజేపీ.. జనసేనలకు ఫ్లెక్సీలు పెట్టుకునే ఛాన్స్‌కూడా లేదు..
పల్లకి మోయడానికి మాత్రమే
భాగస్వామ్యం
గెలిచాక పెద్ద చెరువుగట్టు మీదనే స్థానం

మమ్మల్ని ఎవడ్రా ఆపేది..!