
భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: వివిధ ప్రాజెక్టులకు భూసేకరణకు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా భోగాపురం విమానాశ్రయ భూసేకరణపై కలెక్టర్ సమీక్షిస్తూ ఇప్పటి వరకు జీఎంఆర్‌కు అప్పగించిన 2,200 ఎకరాల భూముల పరిస్థితి, వాటికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం ఇటీవల కేటాయించిన 540 ఎకరాల భూమికి సంబంధించిన స్థితిగతులను ఆరా తీశారు. ట్రంపెట్ బ్రిడ్జి నుంచి విమానాశ్రయానికి వెళ్లే రహదారి నిర్మాణం, భూమి లభ్య తపై సమీక్షించారు. విమానాశ్రయం భూముల నుంచి వర్షపు నీరు వెలుపలికి వెళ్లే మార్గాలు, కాలువలు, సబ్‌స్టేషన్ నిర్మాణం, ప్రత్యేక విద్యుత్ లైన్లు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ఆరా తీశారు. వీటి భూసేకరణకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణపై ఆరా తీశారు. 130 సీడీ, 516 బీ రహదారుల కోసం ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ, పెండింగ్ అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ దాట్ల కీర్తి, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు హెడ్ రామరాజు, జాతీయ రహదారుల పీడీలు పాల్గొన్నారు.