
చంద్రబాబు అబద్ధాలకు హద్దు లేదు
చికెన్
చీపురుపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అబద్ధాలు చెప్పడం గతం నుంచే వెన్నతో పెట్టిన విద్య అని కానీ ప్రస్తుత పరిపాలనలో అబద్ధాలకు హద్దులు లేకుండా పోతుండడం, దానికి అనుకూల మీడియా వంతపాడడం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతృత్వంలో ఈ నెల 19న శుక్రవారం తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను గురువారం ఆయన యువజన విభాగం, విద్యార్థి విభాగం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారని ఆ సమయంలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించలేదన్నారు. కానీ 2019 నుంచి 2024 మధ్య జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించి 2023 నాటికే ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగానే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కావడం, ఈ ఏడాది మూడో బ్యాచ్ అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతుండడం చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టలేని చంద్రబాబు ఉన్న కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు చూడడం అన్యాయమన్నారు.
విజయవంతం చేయాలి
పేదలకు మెరుగైన వైద్యం అందకూడదన్నదే చంద్రబాబు లక్ష్యమని దీనికి ప్రైవేటీకరణ నిదర్శనమన్నారు. అయితే పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తలపెట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, యువజన విభాగం నియోకవర్గం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు బమ్మిడి కార్తీక్, వైఎస్సార్‌సీపీ నాయకులు పతివాడ రాజారావు, ముల్లు పైడిరాజు, మీసాల రామారావు, పాండ్రంకి వాసు, అప్పికొండ ఆదిబాబు, కొసిరెడ్డి రమణ, ఇప్పిలి తిరుమల, డి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం
విద్యార్థి, యువజన విభాగం నేతృత్వంలో నేడు చలో మెడికల్ కాలేజ్
పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్