
చంద్రబాబువి తప్పుడు ఆలోచనలు, విధానాలు
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబువి ఎప్పుడూ తప్పుడు ఆలోచనలు, విధానాలేనని... మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్నారని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించలేదన్నారు. 2019–24 సంవత్సరాల మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించి ప్రారంభించారన్నారు. అధికారంలో ఉన్న వారు ప్రజలకు మేలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేసే దిశగా పని చేయాలని సూచించారు. ఒకప్పుడు అత్యవసర వైద్య సేవల కోసం విశాఖ కేజీహెచ్‌కు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు వెళ్లేవారని, ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీతో జిల్లాలోనే మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, బోడసింగి ఈశ్వరరావు, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం
నేడు వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ
ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్
కోలగట్ల వీరభద్రస్వామి