
స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలకు 37 మంది ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ బాల, బాలికల బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించారు. అండర్–14 విభాగంలో బాలురకు, అండర్–17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 200మందికి పైగా క్రీడాకారులు హాజరై పోటీ పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ బరువుల కేటగిరీల వారీగా ఎంపికలు నిర్వహించగా రెండు విభాగాల్లో మొత్తం 37 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మిలు తెలిపారు. పోటీలను బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ప్రారంభించగా..శాప్ కోచ్ బి.ఈశ్వరరావు, ఖేలో ఇండియా కోచ్ సీతారామంజనేయులు పర్యవేక్షించారు. పోటీలకు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు.