
వైద్యవిద్యను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటు
విజయనగరంఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. అబద్ధాలను నిజంచేసే టాలెంట్ సీఎం చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. విజయనగరం గాజులరేగ వద్ద గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా సోమవారం సాయంత్రం పార్టీ మహిళా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో కళాశాల వద్ద కేక్ కట్ చేసి వేడుకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత ఫోటోలు చూపించి వైద్య విద్యార్థులు బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవాలని హోం మంత్రి అనిత అంటున్నారని, ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చి చూస్తే జగన్‌మోహన్ రెడ్డి ఎంత అభివృద్ధిచేశారో తెలుస్తుందన్నారు. విజయనగరం వైద్య కళాశాలలో 220 మందికి పైగా వైద్య సిబ్బంది పనిచేస్తుండగా, 150 మంది వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా ప్రజల చిరకాల వాంచను నేరవేర్చారన్నారు. 70 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే రూ.500 కోట్లు ఖర్చుతో నిర్మించి ప్రారంభించారని తెలిపారు. ఆయన కృషి వల్ల ఏడాదికి 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలిపారు. నాడు–నేడుతో రాష్ట్రంలో 56 వేల పాఠశాలల రూపు రేఖలు మార్చారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్ మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతోనే కూటమి సర్కారు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే వైద్య విద్యార్థులు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయికుమార్ పాల్గొన్నారు.