
పట్టణాలకు రోగుల పరుగు..!
● నాడు ఇళ్లవద్దకే వైద్యసేవలు
● నేడు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి
● గిరిజన ఆరోగ్యంపై సర్కారు
చిన్నచూపు
వైద్యశిబిరాల నిర్వహణకు ప్రణాళికలు
జిల్లాలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నందున వైద్యశిబిరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రస్తుతం 104 సంచార వాహనాల ద్వారా వైద్యసేవలందిస్తున్నాం. వైద్యశిబిరాల నిర్వహణకు సంబంధించి వైద్యులను అందుబాటులో ఉంచాం. అతి త్వరలో గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించి గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తాం. – ఎస్.భాస్కరరావు,
డీఎంహెచ్‌ఓ, పార్వతీపురం మన్యం
పార్వతీపురంటౌన్: అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు, విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంది. గిరిజన, గిరిశిఖర గ్రామాల్లో విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవల్సిన ప్రభుత్వం, యంత్రాంగం గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఇంటికో జ్వరపీడితుడు ఉన్నా తూతూ మంత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి తప్ప తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గ్రామాల్లో సరిగ్గా వైద్యసేవలు అందక, పీహెచ్‌సీల్లో సరైన వైద్యం అందక పట్టణాల్లో గల ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీసి వైద్యం చేయించుకోవల్సిన దుస్థితి గిరిజనులకు ఏర్పడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గిరిజన, మైదాన ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించి గ్రామాల్లోనే సూపర్ స్పెషలిస్ట్ వైద్యులతో వైద్యశిబిరాలను నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సల నిమిత్తం కార్పొరేట్ వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్య సమస్య తలెత్తరాదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇళ్లవద్దనే పరీక్షలు నిర్వహించి గ్రామాల్లోనే 105 రకాల మందులను అందజేసి గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కల్పించారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, గిరిజనులంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు.
నాడు 1,42,191 మందికి గ్రామాల్లోనే వైద్యసేవలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గిరిజన, మైదాన గ్రామాల్లో కార్పొరేట్ వైద్యులతో వైద్యశిబిరాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 364 వైద్యశిబిరాలు నిర్వహించి 1,42,191 మందికి వైద్యసేవలు అందించారు. అందులో 91,178మందికి బీపీ, 4,571మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించి చికిత్స, వారికి అవసరమైన మందులను అందజేశారు. 2,547మందిని వివిధ రోగాల నిమిత్తం వారిని గుర్తించి మెరుగైన వైద్యసేవల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి రిఫర్‌చేయగా 2,316 మందికి చికిత్స పొందారు. 18,773 మందికి కంటివైద్యపరీక్షలు నిర్వహించి 1260మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించి 232మందికి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఈ శిబిరాల్లోనే 1,229మందికి కళ్లజోళ్లను అందజేశారు.
ఫ్యామిలీ డాక్టర్‌తో ఇళ్లవద్దకే వైద్యసేవలు
దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతిరోజూ గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం వైద్యసేవలు అందించింది. గిరిజన గ్రామాల్లో మంచాన పడి ఉన్న గర్భిణులు, వృద్ధుల ఇళ్లవద్దకే వెళ్లి ఉదయం సమయంలో వైద్యసేవలు అందించి మధ్యాహ్న సమయంలో గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి వైద్యసేవలను అందించేవారు. గ్రామాల్లోనే రక్తపరీక్షలు నిర్వహించి రోగాలను గుర్తించి మందులను అందించేవారు. పట్టణాలకువెళ్లే పరిస్థితి లేకుండా గ్రామాల్లోనే 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు.
ఆ పరిస్థితి కానరాదు
గ్రామాల్లో గతంలో మాదిరి వైద్యసేవలు అందే పరిస్థితి ప్రస్తుతం లేదు. తూతూ మంత్రంగానే 104 వాహనాల ద్వారా వైద్యసేవలు అందించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు, మారుమూల గ్రామస్తులు వేడుకుంటున్నారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ దూరప్రాంతాలకు ప్రయాణం చేసి ఆస్పత్రుల వద్ద లైన్‌లో నిలబడి వైద్యం పొందాల్సిన దుస్థితి ఉందని ప్రభుత్వం, యంత్రాంగం ఇప్పటికై నా స్పందించి గ్రామాల్లో వైద్యసేవలు, రక్తపరీక్షలు, మందులు, వైద్యశిబిరాలు అందుబాటులోకి తీసుకువచ్చి గిరిజన ఆరోగ్యానికి భద్రత కల్పించాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

పట్టణాలకు రోగుల పరుగు..!

పట్టణాలకు రోగుల పరుగు..!