
జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు నలుగురి ఎంపిక
● అక్టోబర్ 8 నుంచి నోయిడాలోపోటీలు
చీపురుపల్లి: జాతీయస్థాయిలో జరగనున్న టెన్నికాయిట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆడేందుకు జిల్లాకు చెందిన నలుగురు ప్రధాన క్రీడాకారులు, ఇద్దరు అదనపు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రధాన క్రీడాకారుల్లో ముగ్గురు మహిళల విభాగం నుంచి కాగా ఒకరు పురుషుల విభాగం నుంచి ఎంపికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో నిర్వహించిన 49వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ పోటీల్లో జిల్లాలోని గరివిడి మండలం కేఎల్.పురానికి చెందిన ఆర్.మౌనిక ప్రథమ స్థానంలో నిలవగా పి.రేణుక తృతీయస్థానం, జి.శ్రావణి నాల్గవ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఈ ముగ్గురిది ఒకే గ్రామం కావడం విశేషం. అలాగే చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన కె.ఇందు అదనపు క్రీడాకారిణిగా ఎంపికై ంది. అలాగే పురుషుల విభాగంలో పార్వతీపురానికి చెందిన ఎస్.రాహుల్ నాల్గవ స్థానంలో నిలిచి ప్రధాన క్రీడాకారుడిగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా పురుషుల విభాగంలో విజయనగరానికి చెందిన కె.చంద్రమౌళిని అదనపు క్రీడాకారుడిగా ఎంపిక చేశారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 8 నుంచి 13 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన టెన్నికాయిట్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామారావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనపరిచి రాష్ట్రంతో బాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.