
అమ్మవారి విగ్రహ ధ్వంసం!
పార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామ ప్రారంభంలో నేలబావి సమీపంలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చేతులను గుర్తు తెలియని ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఆలయంలో వున్న హుండీని ధ్వంసం చేసి నగదును సైతం దొంగలించినట్టు విశ్వహిందు పరిషత్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అక్కడకు చేరుకొని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవతామూర్తుల స్వరూపాలపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. దీనిపై సంబంధిత పోలీసు శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి, వీహెచ్‌పీ తరఫున ఫిర్యా దు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో వీహెచ్‌పీ సభ్యులు శ్రీనివాసరావు, స్థానికులు ఉన్నారు.
పోలీసుల పరిశీలన
విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ బి.సంతోషి కుమారి వెంటనే క్లూస్ టీంతో వెళ్లి పరిశీలించారు. గతంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న చేయి విరిగిందని, దానిని అతికించిన అనంతరం శిథిలమై ఉండవచ్చునని స్థానికులు తెలియజేశారన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించామని ఎస్‌ఐ తెలిపారు.