
జిల్లా సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తాం
సాక్షి ప్రతినిఽధి, విజయనగరం: జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు. జిల్లా నుంచి వలసలను నివారించి, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా జిల్లా ఏయే రంగాల్లో వెనుకబడి ఉందో పరిశీలించి, ఆయా రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. కలెక్టర్‌గా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌కు ఇన్‌చార్జి జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారని, వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణను వేగవంతం చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎగుమతులకు ఎంతో అవకాశం కలుగుతుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెడతామని చెప్పారు. జిల్లా అధికారులు, మండల అధికారులను కలుపుకొని ఒక జట్టుగా సమష్టి కృషితో జిల్లాను ముందుకు నడిపిస్తామని చెప్పారు.