● కూటమి అధికారంలోకి వచ్చాక
నిలిచిపోయిన పనులు
● ప్రభుత్వం స్పందించాలని గిరిజన
సంఘాల డిమాండ్
గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకు మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన తరువాత దాదాపు 80 శాతం పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పూర్తి చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టిందని పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రజలు, పలుగిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కురుపాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా నేటివరకు కురుపాంలో మంజూరైన గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తి కాకుండా నిలిచిపోయాయని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యంగా అప్పటి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పట్టుబట్టి గిరిజన ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించగా వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కురుపాం నియోజకవర్గ కేంద్రం సమీపంలో టేకరఖండి గ్రామం వద్ద 105 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.153.853 కోట్ల అంచనా విలువతో పనులకు నిధులు మంజూచేసింది. కళాశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూకే)కి ప్రభుత్వం అప్పగించింది. త్వరితగతిన కళాశాల పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని అప్పటి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది. అప్పటినుంచి పనులు చురుగ్గా జరిగినా తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
జేఎన్‌టీయూకే నాలుగో క్యాంపస్‌గా
కురుపాం కళాశాల
జేఎన్‌టీయూకే పరిధిలో ఇప్పటికే కాకినాడ, విజయనగరం, నర్సారావుపేటలో మూడు క్యాంపస్‌లు ఉండగా కురుపాం క్యాంపస్ నాలగవదిగా ఉంటుంది. కురుపాం క్యాంపస్‌లో గిరిజన విద్యార్థులకు ఐదు బ్రాంచిలైన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను అందించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్రాంచికి 60 సీట్లు చొప్పున మొత్తం 300 సీట్లు ఉంటాయి. కురుపాం, పార్వతీపురం ప్రాంతాల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. కురుపాం ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభమైతే మన్యం జిల్లాలోని కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల్లో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కళాశాల ఎంతో ఉపయోగ పడుతుంది.
కాంట్రాక్టర్‌కు రూ.8 కోట్ల బకాయి
గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు నిలిచిపోయి రెండేళ్లవుతోంది. అలాగే కాంట్రాక్టర్‌కు కూడా సుమారు రూ.8 కోట్ల వరకు బకాయిలు ఉండిపోయాయి. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తి కాగా చివరి దశలో పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దృష్టి సారించలేదని ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని మన్యం జిల్లా ప్రాంత ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడితే నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవకాశం ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇంజినీరింగ్ కళాశాలకు గ్రహణం..!