
సంతసించేలా చేపల వ్యాపారం
అందుబాటులోకి తీసుకురావాలి
● పూసపాటిరేగ, భోగాపురం తీరంలోని ఎండు చేపలకు గిరాకీ ● ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి ● ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాలు వినియోగంలోకి తెస్తే మరింత ఉపయుక్తం
పూసపాటిరేగ:
జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండ లాల పరిధిలోని సముద్ర తీరంలో లభ్యమయ్యే ఎండు చేపలకు గిరాకీ ఉంది. ప్రతి బుధవారం పూసపాటిరేగ జాతీయరహదారిని ఆనుకొని జరుగుతున్న సంత నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎండుచేపలు ఎగుమతి అవుతున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలలు నుంచి వ్యాపారులు వచ్చి చేపలను కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు. పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి, పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, కొత్తూరు, మ ద్దూరు, నీలగెడ్డపేట, భోగాపురం మండలంలోని చేపలకంచేరు, ముక్కాం, కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేటకు చెందిన మత్స్యకార మహిళలు ‘సంత’సించేలా ఎండుచేపల వ్యాపారం సాగుతోంది.
వారం నుంచి పది రోజులు ఎండబెట్టి..
వేటలో దొరికిన చేపల్లో ఖరీదైనవి తీరంలోనే అమ్ముడవుతాయి. మిగిలిన చేపలను ఉప్పు కలిపిన నీటి లో ఒక రోజు ఉంచిన తరువాత ఎండలో సుమారు 10 రోజులపాటు ఆరబెట్టి సంతకు తరలిస్తారు. నా ణ్యత బాగుండడంతో ఇక్కడి ఎండుచేపలకు గిరాకీ ఉంటుందని మత్స్యకార మహిళలు చెబుతున్నారు.
నిరుపయోగంగా ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాలు
పూసపాటిరేగ మండలం చింతపల్లి, భోగాపురం మండలం ముక్కాంలో సుమారు రూ.2 కోట్ల ఖర్చు తో ఫిష్‌ల్యాండ్ కేంద్రాలు ఉన్నా నిరుపయోగంగానే మారాయి. నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. చేపలు ఎండబెట్టడానికి ప్లాట్‌ఫాం, ఆంక్షన్‌హాల్, అధునాతన కూలింగ్ హాల్‌తో పాటు చేపలు నిల్వ కేంద్రాలు వినియోగానికి దూరంగా ఉన్నాయి. ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకువస్తే ఎండుచేపల వ్యాపారం మరింత విస్తరిస్తుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
తీరప్రాంత గ్రామాల్లో ఫిష్‌ల్యాండింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి. కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల వేలాది రూపాయలు విలువైన మత్స్యసంపద పాడవుతోంది. ముక్కాం, చింతపల్లి గ్రామాల్లో ఉన్న షిఫ్‌ల్యాండింగ్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి, మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి.
– బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకారసొసైటీ అధ్యక్షుడు, విజయనగరం