
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
విజయనగరం: గ్రంథాలయాలు వెలకట్టలేని విజ్ఞాన భాండాగారాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర కల్కూర పేర్కొన్నారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో సీతం ఇంజినీరింగ్ కాలేజీ గ్రంథాలయ విభాగంలో బుధవారం ‘విద్యార్థులు–గ్రంథాలయాల ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లడం ద్వారా విజ్ఞా నంతో పాటు నైతికవిలువలు, నడవడికను నేర్చుకు ని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. పుస్తక పఠనం అనునిత్యం చేయాలని సూచించారు. సంఘ జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణం వంటి ఎందరో మహనీయుల కృషి ఫలి తంగా తెలుగు నేలలో గ్రంథాలయాలు విరివిగా వ్యాప్తిచెందాయని గుర్తు చేశారు. గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకున్నప్పుడే వాటికి సార్ధకత చేకూరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కల్కూరను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, తదితరులు సత్కరించారు. వ్యాసరచన పోటీలలో విజేతలకు, జిల్లాలో విస్తృతంగా సేవలందిస్తున్న గ్రంథ పాలకులకు, ఏపీ గ్రంథాలయ సంఘం ద్వారా సేవలందిస్తున్న సభ్యులకు చంద్రశేఖర కల్కూర పతకాలను ప్రదానంచేశారు. కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్.సత్యవతి సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్, గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షురాలు పిన్నింటి కళావతి, కార్యదర్శి ఎం.సుభద్రాదేవి, తదితరులు పాల్గొన్నారు.