
గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు
● ప్రాసిక్యూషన్ జరుగుతుండగా మరో
నిందితుడి మృతి
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో 2018లో నమోదైన గంజాయి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌కోట స్టేషన్ పరిధి బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద సిబ్బందికి వచ్చిన కచ్చితమైన సమాచారంతో 2018 ఫిబ్రవరి 19 న వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వ్యాన్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన సంతు ముజిందార్ (36), ఏఎస్‌ఆర్ జిల్లా జీకే వీధి మండలం దుప్పలవాడకు చెందిన పంగి ధనుంజయ్ (24) గంజాయి రవాణా చేస్తూ పట్టుబడగా వారి నుంచి 66.2 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ వై.రవికుమార్ నిందితులను రిమాండ్‌కు తరలించి, న్యాయస్థానంలో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌లో నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్ పై నేరారోపణలు రుజువు కావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) సంతు ముజిందార్ ప్రాసిక్యూషన్ సమయంలో మరణించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నిందితుడు (ఎ2) పంగి ధనుంజయ్‌కు శిక్ష పడేలా చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీపీని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.
జిల్లాలోని కొత్తవలస కుమ్మరివీధిలో ఉంటున్న ఒక మహిళపై 2023లో దాడికి పాల్పడి, బంగారు వస్తువులను దోపిడీ చేసిన ఎల్.కోట మండలం జమ్మాదేవి పేటకు చెందిన నిందితుడు మడబత్తుల కృష్ణ (34)కు విజయనగరం 5వ ఏడీజే కోర్టు జడ్జి ఎన్.పద్మావతి జీవిత ఖైదు , రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కొత్తవలస కుమ్మరివీధిలో మడబత్తుల సూర్యకాంతం తన కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. 2023 ఏప్రిల్ 15వతేదీన గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోనికి చొరబడి, ఆమె తలపై కొట్టి, కంట్లో కారం జల్లి, మెడలో బంగారు పుస్తెల తాడు, చెవిదిద్దులను అపహరించికుని పారిపోయాడు. గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా మృతిచెందినట్లు ఆమె అన్నయ్య సూడా అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుపై దోపిడీ చేసి, హత్యకు పాల్పడినట్లు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన అప్పటి కొత్తవలస సీఐ బాల సూర్యారావు విచారణ చేసి, నిందితుడు కృష్ణను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో జడ్జి ఎన్.పద్మావతి పైవిధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.