
వినతులకు పరిష్కారం చూపండి
కలెక్టరేట్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్:
ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 133 వినతులు స్వీకరించారు. వినతుల స్వీకరణలో కలెక్టర్‌తోపాటు డీఆర్‌ఓ హేమలత, ఉప కలెక్టర్ పి. ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం. సుధారాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినతులను సంబంధిత అధికారులే స్వయంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసిన అనంతరం పరిష్కారం చూపాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన ప్రజలు అర్జీలను అందజేశారు.
డీఈఓపై చర్యలు తీసుకోవాలి
గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయులపై వివక్ష చూపుతున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పి.రంజిత్ కుమార్, పల్లా సురేష్, ఆరిక చంద్రశేఖర్, మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదోతరగతి ప్రతిభా అవార్డులలో గిరిజన విద్యార్థులను కానీ, ఉపాధ్యాయ దినోత్సవంలో గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ, కేటాయింపు చేయకుండా వివక్షతో డీఈఓ వ్యవహరిస్తున్నారని, ఈ మేరకు ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
నిర్దేశించిన సమయంలో ఫిర్యాదుల పరిష్కారం
ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు నిర్దేశించిన సమయంలోనే చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించు కోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్‌లో స్వయంగా మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో మొత్తం 12 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 41 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో సోమవారం ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 41 వినతులు వచ్చాయి. ఎరువులు ఇప్పించాలని పాలిష్‌కోట రైతులు అర్జీ ఇచ్చారు. సీసీ రోడ్డు పూర్తి చేయాలని మూర్తిగాడి గూడకు చెందిన సవర రవికుమార్ కోరారు. కొండపోడు పట్టా ఇప్పించాలని శుబలయకు చెందిన పొట్నూరు గౌరికుమారి విన్నవించారు. పెద్దగూడకు చెందిన సవర ఆదమ్మ మోటార్ ఇంజిన్‌కు రుణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కొత్తగూడలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిఇచ్చారు. లాడలో సెల్ టవర్ పెట్టాలని ఆరిక ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో ఏపీవో చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ రామ్మోహన్‌రావు, పీహెచ్‌వో ఎస్వీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

వినతులకు పరిష్కారం చూపండి

వినతులకు పరిష్కారం చూపండి

వినతులకు పరిష్కారం చూపండి