దత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం లారీ ఢీకొనడంతో మర్రివలస గ్రామానికి చెందిన కోరాడ లక్షణరావు(42)అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్.బూర్జవలస ఏఎస్సై రమణ తెలిపారు. ఈ మేరకు స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం నుంచి గజపతినగరం వెళ్తున్న లారీ బస్సు కోసం ఉన్న లక్షణరావు వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కొన్నాళ్లు క్రితం భార్యతో తెగతెంపులు అవగా కూలి పనులు చేసుకుంటూ అన్నదమ్ముల వద్ద ఉంటున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు.
ఎన్‌ఎంఎంఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: డిసెంబర్ 7న జరగనున్న ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. రాజ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలు రాయడానికి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుని కుటుంబ సంవత్సరాదాయం రూ.:3.5లక్షలు మించకూడదని తెలిపారు. ఈనెల 30వ తేదీలోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పార్వతీపురంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పని దినాల్లో సంప్రదించాలని ప్రకటనలో కోరారు.
జాతీయస్థాయి పోటీలకు రాజాం క్రీడాకారులు
రాజాం సిటీ: ఈ నెల 26 నుంచి 29 వరకు జమ్ము కశ్మీర్‌లో జరగనున్న పికిల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రాజాం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7తేదీలలో విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగ్గా రాజాంకు చెందిన పీవీజీకే రాజు, డాక్టర్ బీహెచ్ అరుణ్‌కుమార్, డాక్టర్ ఎం.పురుషోత్తం, సీహెచ్ రామకృష్ణంరాజు, బి.శాంతిస్వరూప్, ఆర్.విజయకృష్ణలు చక్కని ప్రతిభకనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎంపిక జాబితా వచ్చిందని క్రీడాకారులు తెలిపారు. వారి ఎంపికపట్ల రాజాంకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు.
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సంతకవిటి: మండలంలోని తాలాడ గ్రామానికి చెందిన బింగి లక్ష్మణరావు సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అప్పుల బాధ తాళలేక లక్ష్మణరావు తన కళ్లలంలోని రేకుల షెడ్‌లో ఉరి వేసుకున్నట్లు భార్య గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసు శాఖకు జాగిలాల కేటాయింపు
పార్వతీపురం రూరల్: పోలీసుశాఖలో కీలకంగా వ్యవహరించి పేలుడు పదార్థాల కేసుల ఛేదింపు, నేరస్తులను గుర్తించడంలో ఉపయోగపడే జాగిలాలను జిల్లా పోలీసు శాఖకు రెండింటిని కేటాయించారు. ఈ మేరకు సోమవారం నూతన జాగిలాలు జూలీ, చార్లీతో పాటు హేండర్స్ ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రెండు జాగిలాలు విజయవాడ మంగళగిరి హెడ్‌క్వార్టర్స్ 6వ బెటాలియన్‌లో సీటీసీలో శిక్షణ పొందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ వాటి హేండర్‌లైన పార్వతీశం, లక్ష్మణరావు, ఆనంద్‌మోహన్‌లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, డాగ్ హేండర్లు తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖకు జాగిలాల కేటాయింపు

జాతీయస్థాయి పోటీలకు రాజాం క్రీడాకారులు