
సతివాడ ఘటనలో 72 మందిపై కేసుల నమోదు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఇటీవల జరిగిన గణనాథుడి ఊరేగింపులో తలెత్తిన ఉద్రిక్తత ఘటనలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మొత్తం 72 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ సోమవారం తెలిపారు. ఎస్సీ కాలనీ గణేష్ నిమజ్జనం ఊరేగింపులో బీసీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. దళితులమనే అక్కసుతోనే తమ గణేష్ ఊరేగింపును అడ్డగించారని, కులం పేరిట దూషించారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన 36 మందిపై ఉత్సవ నిర్వాహుకులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..ఫిర్యాదులో పేర్కొన్న 36 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదే ఘటనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు బీసీ మహిళలపై దాడి చేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వారు కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 36 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో మొత్తం 72 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ పికెట్ గ్రామంలో కొనసాగిస్తున్నామన్నారు.