
పైడితల్లమ్మ జాతరకు సన్నాహాలు
విజయనగరం: నగరంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి, మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. రానున్న పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో ఇంజినీరింగ్ పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి నిర్దేశిత పనులు పూర్తి కావాలని కమిషనర్ పల్లి నల్లనయ్య సిబ్బందికి నిర్దేశించారు. దీంతో పనుల ప్రక్రియ ఊపందుకుంది. స్థానిక రాజారావు మేడ వద్ద బీటీ రహదారి మరమ్మతు పనులు సాగుతున్నాయి. అలాగే ప్రశాంతినగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంక్రీట్ పని జరుగుతోంది. గాయత్రి నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం సాగుతోంది. మయూరి ఎత్తు బ్రిడ్జి వద్ద సీసీ బెర్ము పనులు చేపట్టారు. కాటవీధి వద్ద కల్వర్టు మరమ్మతులు పూర్తి చేశారు. కాళీమాత టెంపుల్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పరిసరాల్లో ఉన్న డివైడర్ గ్రిల్స్‌కు రకరకాల రంగులు అద్దుతున్నారు. ఆయా పనులను డీఈ శ్రీనివాసరావు, ఏఈలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్లలోని బూస్టర్ పంప్ హౌస్ ప్రాంతాన్ని డీఈ నరసింహారెడ్డి పరిశీలించారు. కొన్ని ప్రాంతాలలో రహదారులకు ఇరువైపులా ఉన్న లతలను సిబ్బంది తొలగించారు. గుబురుగా ఉన్న ప్రాంతాలను చదును చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ పైడితల్లమ్మ జాతర నాటికి నగర సుందరీకరణలో భాగంగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. ఈనెల 20వ తేదీలోగా పనులు పూర్తి చేసి ప్రజలు, భక్తుల కోసం నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం మరింత సమర్థవంతంగా జాతర నిర్వహించేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు.