
ఘర్షణలో ఇద్దరికి గాయాలు
విజయనగరం క్రైమ్ : నగరంలోని పోలీసు కార్యాలయానికి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ సమీపంలో ఉన్న ఓ బిర్యానీ పాయింట్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య గురువారం సాయంత్రం ఘర్షణ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. బిర్యానీ పాయింట్ వద్ద ఉమర్, నజీర్ అనే వ్యక్తుల మధ్య మసీదు అభివృద్ధి విషయమై వివాదం తలెత్తింది. అది కాస్త వారిద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. విషయం కంట్రోల్ రూమ్‌కు తెలియడంతో విజయనగరం వన్‌టౌన్ సీఐ ఆర్‌వీకే చౌదరి, ఎస్‌ఐలు రామ్‌గణేష్, లక్ష్మీప్రసన్నకుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వివాదం నేపథ్యంలో బిర్యానీ పాయింట్ వద్ద, మసీదు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.