
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలొద్దు
● ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి
సాక్షి, విశాఖపట్నం :
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, వీటితో వినియోగదారులపై అదనపు భారం ఉండే అవకాశమే లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ విషయంలో వస్తున్న వదంతులపై ఆయన స్పందిస్తూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు ఆర్డీఎస్‌ఎస్ పథకంలో భాగంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం ప్రభుత్వ, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుతం వీటిని అమర్చుతున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు ఎక్కువ విద్యుత్ వినియోగం కలిగిన (హై వేల్యూ) గృహ వినియోగదారులకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు సమయంలో వినియోగదారులు వాటి ఖరీదు, ఛార్జీలు కానీ, మామూళ్లు కానీ చెల్లించవలసిన అవసరం లేదని సీఎండీ తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులపై విపరీత భారాలు పడతాయనే ఆందోళన అవసరం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు పాత మీటర్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయవని, వీటి కారణంగా బిల్లులు పెరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన టారీఫ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు వసూలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ మీటర్లకు సంబంధించిన బిల్లు వివరాలను నేరుగా వినియోగదారుని మొబైల్‌కు చేరవేస్తామని ఆయన చెప్పారు. వినియోగం, ఖర్చుపై పూర్తి నియంత్రణ వినియోగదారుల చేతుల్లో ఉండటం వలన విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా ప్లాన్ చేయడంలో స్మార్ట్ మీటర్లు సహయకరిస్తాయని పేర్కొన్నారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి సందేహం ఉన్నా.. టోల్ ఫ్రీ నంబరు 1912కి సంప్రదించాలని సీఎండీ పృథ్వీతేజ్ ఆ ప్రకటనలో సూచించారు.