
చంపేసినా ఇక్కడ నుంచి కదిలేదిలేదు
విజయనగరం ఫోర్ట్: మమ్మల్ని చంపేస్తారా.. చంపేయండి.. 26 ఏళ్లుగా ఇక్కడే కూరగాయాలు విక్రయిస్తూ జీవిస్తున్నాం.. ఈ స్థలంలోనే చచ్చిపోతాం.. అంతేగాని ఇక్కడ నుంచి కదిలేది లేదు. చంపేస్తారా రండి ఇక్కడే అందరం రోడ్డుపై పడుకుంటాం. మా మీద నుంచి ఏబండి ఎక్కించేస్తారో ఎక్కించేయండి అంటూ అధికారుల ఎదుట ఎం.ఆర్. రైతు బజార్ రైతులు శనివారం ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలోని అన్ని రైతు బజార్ల ఎస్టేట్ అధికారులు ఎం.ఆర్.రైతుబజార్ రైతులతో సమావేశమయ్యారు. రైతు బజార్‌ను రింగ్‌రోడ్డు బజార్‌కు తరలించేందుకు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రింగ్ రోడ్డు బజార్‌లో షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా రైతు బజార్ ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తామని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ దశలో రైతులు మాట్లాడుతూ మాకు ప్రత్యేకంగా రైతుబజారు నిర్మించి చూపించండి.. అప్పుడే ఇక్కడ నుంచి కదులుతాం.. రైతు బజార్ కూడా ఎం.ఆర్. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు మమ్మల్ని చంపినా, నరికినా, కొట్టినా, ఇక్కడ నుంచి కదిలేదిలేదు. మా బతుకులు రోడ్డున పడిన తర్వాత చనిపోతే ఏమైపోతోందంటూ రైతులు పాలూరి విజయలక్ష్మి, వనం జయలక్ష్మి, సునీత తదితరులు ఎస్టేట్ అధికారుల వద్ద వాపోయారు. రాజు స్థలం అంటున్నారు.. అలాంటప్పడు మా దగ్గర ప్రతినెలా అద్దె కట్టించుకుని ప్రభుత్వ ముద్రవేసి రశీదులు ఎందుకిచ్చారని నిలదీశారు. ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ తేల్చిచెప్పారు.
అధికారులకు స్పష్టంచేసిన
ఎం.ఆర్.రైతు బజార్ రైతులు