
తల్లీకొడుకుల అదృశ్యం
సీతానగరం: మండలంలోని అంటిపేట గ్రామానికి చెందిన తల్లీకొడుకులు ఈ నెల 23 నుంచి కనిపించడంలేదు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 23న రాత్రి కుటుంబసభ్యులు ఇంట్లో గొడవ పడ్డారు. ఇంట్లో గొడవ అనంతరం అందరూ గాఢనిద్రలో ఉన్నసమయంలో కొడుకును తీసుకుని తల్లి ఇంటినుంచి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. 24న ఉదయం నుంచి తల్లీకొడుకుల ఆచూకీ కోసం గ్రామంలోనే కాకుండా చుట్టాలు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా ఆచూకీ కనిపింక పోవడంతో అదృశ్యమైన మహిళ తల్లి సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు.
లారీని ఢీకొని యువకుడి మృతి
గంట్యాడ: బొండపల్లి మండలం రాళ్లవాక గ్రామానికి చెందిన యువకుడు బొండపల్లి జగన్ (19) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హోరోహోండా గ్లామర్ బైక్‌పై కింతాడ మధు అనే వ్యక్తితో కలిసి బొండపల్లి జగన్ ఆదివారం రాత్రి విజయనగరం మండలం సారిక గ్రామానికి వెళ్తుండగా రామవరం ఫైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో జగన్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మధుకు తల, ఎడమ కాలికి తీవ్ర గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు.
మామిడి తోట ధ్వంసం
గరుగుబిల్లి: ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి గరుగుబిల్లి మండలంలోని తోటపల్లిలో ప్రవేశించి గ్రామానికి చెందిన లోపింటి వెంకయ్య మామిడి తోటను ధ్వంసం చేశాయి. మరో రెండు మూడు రోజుల్లో చేతికి రావాల్సిన పంటను నష్టపరిచాయి. 15ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఎకరా డీ పట్టా భూమిలో మామిడి తోటను వేసుకుని జీవనోపాధి పొందుతున్న వెంకయ్యకు చేతికి అందిన పంట ఏనుగుల రూపంలో నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంటను నష్టపరచడమే కాకుండా కొన్ని చెట్లను కూడా భూమి నుంచి పెకిలించి వేశాయని బాధితుడు వాపోయాడు. ఏనుగుల కారణంగా మామిడి తోటలో సుమారు రూ.50వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు స్పందించి జరిగిన పంటనష్టాన్ని అంచనావేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజాం సిటీ: మండల పరిధి గడిముడిదాం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బలిజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి వెంకటరమణ (40) మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ద్విచక్రవాహనంపై రాజాం వస్తున్నాడు. గడిముడిదాం–బుచ్చెంపేట గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఆటో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆటోడ్రైవర్ స్థానిక కేర్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విశాఖపట్నం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని మేనమామ శంబంగి జగన్మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

తల్లీకొడుకుల అదృశ్యం