
వైద్య శాఖలో బదిలీ ఫీవర్..!
విజయనగరం ఫోర్ట్: వైద్యవిధాన్ పరిషత్ కార్యాలయంలో ఓ ఉద్యోగి 10 ఏళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్నట్లు సమాచారం. ఒకే చోట పనిచేయడం వల్ల అధికారులను సైతం శాసించే విధంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారిగా ఎవరు వచ్చినా సదరు ఉద్యోగి మాటే చెల్లుబాటవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే శాఖలో మరో ఉద్యోగి కూడా ఐదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నాడు.
ఇలా వీరిద్దరే కాదు. మరి కొంతమంది ఉద్యోగులు కూడా ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏ శాఖలో అయినా 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి వివరాలు జాబితాను వెల్లడిస్తారు. కానీ వైద్యవిధాన్ పరిషత్ అధికారులు మాత్రం అ శాఖలో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. లోపాలు బయట పడతాయనో, మరో కారణం చేతనో వివరాలు వెల్లడించడం లేదు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారి వివరాలు బయట పడతాయనే ఉద్దేశంతోనే అధికారులు వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఆస్పత్రుల వివరాలు
వైద్యవిధాన్ పరిషత్ పరిధిలో ఎస్.కోట, గజపతినగరం, చీపురపల్లి, రాజాం ఏరియా ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, నెల్లిమర్లలో సీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి పరిధిలో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ సూపరింటెండెంట్స్, ఎంఎన్‌ఓ, అటెండర్స్, ఏఓ తదితర కేడర్లలో ఉద్యోగులు పనిచేస్తున్నారు.
దీర్ఘకాలం ఒకేచోట పని చేస్తే అవినీతికి ఆస్కారం
ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో నూ ఇటువంటి వారు తమ వారికి ఉద్యోగాలను కట్టబెట్టుకునే అవకాశం ఉందనే విమర్శలు ఉన్నాయి.
వైద్యారోగ్యశాఖలోనూ ఇదే పరిస్థితి:
వైద్యారోగ్యశాఖలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి కావడంతో ఇక్కడ కూడా ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. వివిధ కేడర్లలో ఉద్యోగులు ఇక్కడ కూడా ఒకే చోట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏళ్లతరబడి ఒకేచోట పనిచేసిన వారిలో గుబులు
ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి
పారదర్శకంగా బదిలీలు
ఐదేళ్లకు పైబడి ఒకే చోట పనిచేసిన వారి వివరా లు వెల్లడించడానికి ఉన్నతాధికారుల పర్మిషన్ అ డిగాం. పర్మిషన్ రాకపోవడంతో వివరాలు వెల్ల డించలేదు. బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం
డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీరాణి, డీసీహెచ్‌ఎస్