ఎన్‌ఐఏ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
విజయనగరం క్రైమ్: స్లీపర్ సెల్స్‌తోనే దేశంలోని ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపేందుకు పథకం రూపొందించినట్టు ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారుల విచారణలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లు వెల్లడించినట్టు సమాచారం. విజయనగరం పీటీసీలో మంగళవారం ఐదో రోజు విచారణ దాదాపు పదకొండు గంటల పాటు సాగినట్టు తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన ఏడురోజుల కస్టడీ గడువులో తొలుత రెండు, మూడు రోజులు నోరుమెదపని సిరాజ్, సమీర్‌లు నాలుగు, ఐదో రోజు ఉగ్రకుట్ర వివరాలు వెల్లడించినట్టు తెలిసింది.
బాంబుపేలుళ్ల కుట్రకేసులో ప్రధాన సూత్రధారి సిరాజ్‌గా విచారణలో నిర్ధారణకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు కీలక ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు. అహీంగ్రూప్‌లో ఉన్న 20 మంది సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆ గ్రూపు సభ్యులతోనే ఏడు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ప్రశాంతకు మారుపేరుగా ఉన్న విజయనగరం జిల్లాను ధ్వంసం చేసేందుకు సిరాజ్ పథకం వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఒక విద్యార్థి.. ఏడుగురు సిబ్బంది
బొబ్బిలి: స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలను పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రంగా కేటాయించారు. మంగళవారం జరిగిన సంస్కృతం పరీక్షకు ఒకే విద్యా ర్థిని హాజరుకాగా... చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, ఓ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, ఆయాలతో పాటు ఒక ఏఎస్‌ఐ విధులు నిర్వహించారు. ఒక్కరైనా.. వంద మంది పరీక్ష రాసినా నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాల్సిందేనని హెచ్‌ఎం జగదీష్ కుమార్ తెలిపారు.
పేర్లు నమోదు చేయండి: జేసీ
విజయనగరం అర్బన్: జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారి పేర్లు యోగాంధ్ర పోర్టల్‌లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధనవ్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో 7.8 లక్షల మందిని యోగాంధ్రలో భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ప్రతిరోజూ కనీసం 50 వేల మందిని నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 85 మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. జిల్లాలో 5,270 మంది ట్రైనర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. వీరికి నేటి నుంచి 31వ తేదీ వరకు ఆయా మండలాల్లో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారని తెలిపారు.
29న నాన్ టీచింగ్ పోస్టులకు ఇంటర్వ్యూలు
విజయనగరం అర్బన్: జిల్లాలో కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న చౌకీదార్ కుక్, డే వాస్ ఉమెన్/నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ వంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సమగ్ర శిక్ష ఏపీబీ డాక్టర్ ఎ.రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆ రోజు ఉదయం 9 గంటలకు విద్యార్హత ఒరిజినల్, జెరాక్స్ కాపీలతో హాజరుకావాలని తెలిపారు. అర్హుల జాబితాను ‘విజయనగరం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు.
కూటమి ప్రభుత్వంలో దళితులపై పెరిగిన దాడులు
● దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయశంకర్
శృంగవరపుకోట: కూటమి ప్రభుత్వ పాలనలో దళిత, మైనార్టీ యువకులపై దాడు లు ఎక్కువయ్యాయని దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జయశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నడి రోడ్డుపై తెనాలిలో ముగ్గురు దళిత యువకులను విచక్షణ రహితంగా కొట్టడం తగదని, పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్.కోట పట్టణంలో మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏవరైనా తప్పు చేస్తే కోర్టులో హాజరుపర్చి తగిన శిక్షపడేలా చేయాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తామే న్యాయమూర్తులమని భ్రమించి శిక్షించడం సమంజసం కాదన్నారు. తెనాలి ఘటనపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులైన సీఐలు రాములునాయక్, రమేష్‌బాబు, కానిస్టేబుల్ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.