
ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్ల కొరత
విజయనగరం ఫోర్ట్: సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్)లో సూపర్‌వైజర్ల కొరత నెలకొంది. పర్యవేక్షణ లోపం వెంటాడుతోంది. జిల్లాలో 2,499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 2,206 మెయిన్ కేంద్రాలు. వీటి పరిధిలో 0 నుంచి 6 నెలలలోపు పిల్లలు 5,889 మంది ఉన్నారు. 7 నెలలు నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 39,976 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు 27,918 మంది ఉన్నారు. వాస్తవంగా ఐసీడీఎస్‌లో 100 సూపర్ వైజర్లు ఉండాలి. ప్రస్తుతం 71 మంది మాత్రమే ఉన్నారు. 29 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో గ్రేడ్ –1 సూపర్ వైజర్ పోస్టులు 54 కాగా 52 మంది ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్ సూపర్ వైజర్ పోస్టులు 46 కాగా 16 మంది రెగ్యులర్ సూపర్ వైజర్లు, ముగ్గురు కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు ఉన్నారు. 27 సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ లోపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విధులు ఇలా..
ఒక్కో సూపర్ వైజర్ 20 నుంచి 25 అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలి. పోస్టుల ఖాళీలతో కొంతమంది సూపర్ వైజర్లు 50 కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. సరుకుల సరఫరా, నాణ్యత లోపిస్తే సరుకులను తిప్పిపంపించడం, అంగన్‌వాడీ కార్యకర్తలు అందించే సేవలు ఆన్‌లైన్ నమోదులో సాంకేతిక సమస్యలు పరిష్కరించడం, అంగన్‌వాడీ కార్యకర్తకు, సీడీపీఓకు సమన్వయకర్తగా వ్యవహరించడం వంటి విధులను సూపర్ వైజర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఐసీడీఎస్ డీపీ రుక్కానా సుల్తానా బేగం తెలిపారు.

ఐసీడీఎస్‌లో సూపర్‌వైజర్ల కొరత