
చక్కెర ఫ్యాక్టరీలపై చర్చ ఎక్కడ?
విజయనగరం గంటస్తంభం:
రాష్ట్రంలో మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సాగిన కేబినెట్ సమావేశంలో కనీసం చర్చించకపోవడం విచారకరమని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, భీమసింగి చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు, యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చి మర్చిపోవడం తగదన్నారు. 2025–26 సంవత్సరంలోనైనా ఫ్యాక్టరీలు తెరిపించి క్రషింగ్ జరిగేలా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మూతపడిన ఫ్యాక్టరీల కార్మికులు, ఉద్యోగులు, రైతు బకాయిలు సుమారు రూ.33 కోట్లు ఉన్నాయని, చాలామంది కార్మికులు ఆందోళనతో చనిపోయారన్నారు. సమావేశంలో ఇప్పలవలస గోపాలరావు, తుమ్మగంటి రామ్మోహనరావు పాల్గొన్నారు.
చంద్రబాబు కేబినెట్‌లో ప్రస్తావన
లేకపోవడం బాధాకరం
హామీ ఇచ్చి మర్చిపోవడంపై ఆందోళన