విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష నిర్వహిస్తామని వయోజన విద్య డీడీ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు అక్షరాలు రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్పించామన్నారు. వారి చదువు పురోగతిని తెలుసుకునేందుకు ఫౌండేషన్ లిటరస్ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ టెస్ట్ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లబ్ధిదారుకు వీలైన సమయంలోని 3 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అనువైన స్థలాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ ద్వారా అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ జి.ప్రసన్న, వయోజన విద్య ఏఓ సీహెచ్‌ఆర్‌సీ ధనలక్ష్మి, సీడీపీఓలు, వెలుగు ఏపీఎంలు పాల్గొన్నారు.